క్రిస్మస్ ని ఎందుకు జరుపుకుంటారంటే

సుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే క్రిస్మస్ పండుగ ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం!


రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్‌కు పెళ్లి కుదిరింది. అయితే ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనబడి కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావని తెలిపిందట. అంతే కాదు పుట్టే బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడు' అని దేవదూత చెప్పాడు. ఏసు అంటే రక్షకుడు అని అర్థం.


దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒక రోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి' మేరీని నీవు విడిచిపెట్టవద్దు. ఆమె భగవంతుని వరం వల్ల గర్భవతి అయింది. కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు. తనను నమ్మిన ప్రజలందరిని వాళ్ల పాపాల నుంచి రక్షిస్తాడు.' అని చెప్పాడు.


తరువాత జోసెఫ్ మేరీ స్వగ్రామం బెత్లేహేమ్‌కు వెళ్లారు. తీరా అక్కడకు చేరుకునేసరికి ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం ఇచ్చాడు. అక్కడే మేరీ ఏసుకు జన్మనిచ్చింది. అలా రెండు వేల సంవత్సరాల కిందట డిసెంబరు 24 న అర్థరాత్రి 12 తర్వాత జీసస్ జన్మించాడు. అంటే డిసెంబరు 25న జన్మించడంతో ఆ రోజునే క్రిస్మస్ జరుపుకుంటారని చెబుతారు.


క్రిస్‌మస్‌కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చ్‌లను అందంగా అలంకరిస్తారు. వెదురు బద్దలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారుచేసి ఇంటిపై వేలాడ దీస్తారు. అలాగే తమ ఇంట్లో క్రిస్‌మస్‌ ట్రీ ఏర్పాటు చేస్తారు. దీన్ని రంగు రంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, చిన్న చిన్న గాజు గోళాలతోను అలంకరిస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత.