కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్యను వుహాన్ నగరం 50 శాతం రెట్టింపు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే తరహాలో దాదాపు అన్ని దేశాలు తమ మృత్యు గణాంక వివరాలను మార్చే అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. వుహాన్ నగరం ఒక్కసారిగా మరణాల సంఖ్యను పెంచడంతో.. ఆ దేశ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మహమ్మారి విజృంభిస్తున్న తీరును పరిశీలిస్తుంటే.. అన్ని కేసులను గుర్తించడం, మరణాలను నమోదు చేయడం అంత సులువు కాదు అని డబ్ల్యూహెచ్‌వో కోవిడ్19 టెక్నికల్ హెడ్ మారియ వాన్ కెర్కోవ్ తెలిపారు.
జెనీవాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వుహాన్ తరహాలోనే అనేక దేశాలు తమ మరణాల సంఖ్యను మార్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మరణాలకు సంబంధించి వుహాన్ నగర అధికారులు తమ డేటాబేస్‌ను మళ్లీ చెక్ చేశారని, ఏదైనా లోటు జరిగిందా అన్న కోణంలో విచారించిన తర్వాతే కొత్త గణాంకాలను రిలీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. శుక్రవారం రోజున వుహాన్ కొత్తగా 1290 మరణాలను తన పాత జాబితాకు కలిపింది. దీంతో ఆ నగరంలో మృతిచెందిన వారి సంఖ్య 3869గా నిలిచింది.